amarinder singh: 1964-67 మధ్యలో కనీసం 100 సర్జికల్ దాడులు జరిగాయి.. మోదీకి చరిత్ర పాఠాలు చెప్పాలి: అమరీందర్ సింగ్

  • చరిత్రలో తామే మొదటిసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్టు మోదీ చెప్పుకుంటున్నారు
  • పాకిస్థాన్ ను ఇందిర రెండు ముక్కలు చేశారు
  • పంజాబ్ ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు

భారత దేశ చరిత్రలో తామే మొదటి సారి సర్జికల్ స్ట్రయిక్స్ జరిపినట్టు ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఎద్దేవా చేశారు. చరిత్ర గురించి ఏ మాత్రం తెలియని మోదీకి... హిస్టరీ పాఠాలు చెప్పాలని అన్నారు. మిలిటరీ చరిత్ర తెలిసిన ఎవరికైనా... గతంలో కూడా ఎన్నో సర్జికల్ దాడులు జరిగాయనే విషయం అర్థమవుతుందని చెప్పారు. 1964 నుంచి 1967 మధ్యలో తాను వెస్టర్న్ కమాండ్ లో పని చేసినప్పుడు కనీసం 100 దాడులు జరిగాయని తెలిపారు. బీజేపీ వాళ్లు కొత్తగా సర్జికల్ దాడులు అని పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తాము ఆ దాడులను క్రాస్ బోర్డర్ రెయిడ్స్ అని పిలిచేవాళ్లమని చెప్పారు.

అమరీందర్ సింగ్ ఇండియన్ ఆర్మీలో పని చేసిన సంగతి తెలిసిందే. 1960వ దశకంలో సిక్కు రెజిమెంట్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ సేవలు అందించారు. 1947, 1965, 1971లో భారత ప్రధాని ఎవరని అమరీందర్ ప్రశ్నించారు. ఇందిర హయాంలో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేశామని... అయినా తాను సాధించానని ఇందిర ఏనాడూ చెప్పుకోలేదని అన్నారు. ఇది భారత సైన్యం సాధించిన ఘనత అని మాత్రమే ఇందిర చెప్పారని తెలిపారు. కానీ, ఇప్పుడున్న ప్రధాని మాత్రం అంతా తానే చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బాలాకోట్ దాడులు తన గొప్పదనమే అని మోదీ చెప్పుకుంటే... కచ్చితంగా ఆయన అబద్ధాలు చెబుతున్నట్టేనని అన్నారు.

బాలాకోట్ దాడులు కేవలం మోదీ రాష్ట్రానికి (గుజరాత్) సంబంధించిన సమస్య మాత్రమే కాదని అమరీందర్ చెప్పారు. పాకిస్థాన్ తో పంజాబ్ కు 540 కిలోమీటర్ల సరిహద్దు ఉందని... పంజాబ్ ప్రజలు ఎవరూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని... శాంతిని మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ-3 ప్రభుత్వం కొలువుదీరుతుందని జోస్యం చెప్పారు.

More Telugu News