two bills: ఏపీకి చెందిన మారిటైమ్‌ బోర్డు, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సవరణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

  • బిల్లులపై సంతకం పెట్టిన రామ్‌నాథ్‌ కోవింద్‌
  • అసెంబ్లీ కార్యదర్శికి కేంద్ర హోం శాఖ లేఖ
  • ప్రతులు మీడియాకు విడుదల చేసిన ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో ఓడ రేవుల సత్వరాభివృద్ధి, వినియోగం, పారిశ్రామికీకరణ కోసం తీర ప్రాంత బోర్డు ఏర్పాటుకు అవకాశం కల్పించే ఏపీ సముద్ర తీరప్రాంత బోర్డు (మారిటైమ్‌ బోర్డు) బిల్లు-2018ను రాష్ట్రపతి ఆమోదించారు. అలాగే, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌  (ఆంధ్రప్రదేశ్‌ అమెండ్‌మెంట్‌) బిల్లు- 2018ను కూడా రాష్ట్రపతి ఆమోదించారు. తీవ్రమైన అపరాధం కేసుల్లో బెయిల్‌ పొందిన వ్యక్తిని న్యాయస్థానం నిర్ణయించిన తేదీన హాజరు పర్చడంలో హామీదారుడు విఫలమైన సందర్భాల్లో హామీ పత్రంలో తెలిపిన మొత్తం మించకుండా జరిమానా విధించేలా ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రథమ కార్యదర్శి ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి ఎం.విజయరాజుకు లేఖ రాశారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ జారీ చేసిన ప్రతులను ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాష్‌ మీడియాకు విడుదల చేశారు.

More Telugu News