Tollywood: ఇలాంటి రూల్ వస్తే ఒక్క రోజులో ఎన్ని మర్డర్లు జరుగుతాయో?: నాగబాబు

  • నాగబాబు ఊహాజనిత రూల్
  • ఎవరు ఎవరినైనా చంపేసుకోవచ్చు అనే రూల్ వస్తే..
  • పవిత్రంగా దేవుడిని పూజించే వ్యక్తి కూడా చంపేస్తాడు

ఎవరు ఎవరినైనా చంపేసుకోవచ్చు, కొట్టచ్చు, ఎవరిపైనా కేసులు ఉండవన్న ఒక రూల్ కనుక వస్తే.. ఒక్క రోజులో ఎన్ని మర్డర్లు జరుగుతాయి? ఎంత మంది చచ్చిపోతారు? అంటూ ప్రముఖ సినీనటుడు నాగబాబు ప్రశ్నించారు. ‘మై ఛానెల్ అంతా నా ఇష్టం’లో ’దేవుడు’, ‘మతం’, ‘స్వర్గం-నరకం’ గురించి ఆయన మాట్లాడుతూ, ఈ ఊహాజనిత అంశం గురించి ఆయన ప్రస్తావించారు.

ఈ రూల్ కనుక వస్తే, కేసు ఉండదు కనుక, అప్పటి దాకా పరమ పవిత్రంగా దేవుడిని పూజించే మనిషి కూడా, ఇద్దరు, ముగ్గురిని చంపుతాడేమోనని నాగబాబు అన్నారు. ఎందుకంటే, ఫలానా వాడు మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడని, తన మతం గురించి తప్పు వ్యాఖ్యలు చేశాడని, తన మతాన్ని గౌరవించలేదని చెప్పి చంపేశానని అంటాడని సెటైర్లు విసిరారు.

‘దేవుడు’ అంటే భక్తి, భయం ఎవరికీ లేవని, ఒకవేళ భయపడినట్టయితే.. ఈ ప్రపంచయుద్ధాలు వచ్చి ఉండేవి కాదని అన్నారు. ఆ భయమే కనుక ఉంటే, ఏ రాజకీయనాయకుడు ఇన్ని దుర్మార్గాలు, కుంభకోణాలు, కుట్రలు చేయడని వ్యాఖ్యానించారు. వీళ్లందరూ భయపడేది కేవలం, లా అండ్ ఆర్డర్ కే అని, సరైన లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంటే కచ్చితంగా లైన్ లోకి వస్తారని, అప్పుడు, ‘దేవుడు’తో అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పాపభీతి అనే పదం మనం సరదాగా వాడుకోవడానికే తప్ప, దేనికీ పనిచేయదని నాగబాబు చెప్పడం గమనార్హం.

‘స్వర్గం-నరకం’ అనేవి లేవని, తాను నమ్మనని ఆయన అభిప్రాయపడ్డారు. జనాలతో మంచి పనులు చేయించడానికి మతాలు పెట్టినవే ఇవన్నీ అని, అంతేతప్ప, అలాంటివేవీ లేవని నాగబాబు అన్నారు. 

More Telugu News