jyotiraditya scindia: ఏ పార్టీకి మెజార్టీ రాదు.. నా అభిప్రాయం ఇదే: జ్యోతిరాదిత్య సింధియా

  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీని ఏ పార్టీ సాధించలేదు
  • మళ్లీ వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
  • మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జ్యోతిరాదిత్య సింధియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మరే పార్టీ అయినా సరే... ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీని సాధించలేవని అన్నారు. ఐదు దశల పోలింగ్ పూర్తయిన తర్వాత ఇది తన అభిప్రాయమని చెప్పారు. గత 25 నుంచి 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న మాదిరిగానే మళ్లీ సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని తెలిపారు.

గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నట్టు తనకు అనిపిస్తోందని సింధియా చెప్పారు. తన అంచనా ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు. తన మిత్రపక్షాలతో కలసి కాంగ్రెస్ పార్టీ బలమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో... జాతీయవాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని సింధియా ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. దేశం వెలిగిపోతోందని బీజేపీ నేతలు అంటున్నారని... దేశంలో బీజేపీ మాత్రమే వెలిగిపోతోందని, మిగిలినదంతా చీకటిలోనే ఉందని విమర్శించారు.

ప్రధాని అభ్యర్థిగా తమ మొదటి ఛాయిస్ రాహుల్ గాంధీనే అని... అయితే, ఈ విషయంలో యూపీఏ భాగస్వాములంతా కలసి తుది నిర్ణయం తీసుకుంటారని సింధియా చెప్పారు.

More Telugu News