Andhra Pradesh: రెండుసార్లు భారత ప్రధానిని నిలబెట్టిన ఘనత చంద్రబాబుదే!: సాధినేని యామిని

  • 21 పార్టీలతో కేంద్రంపై బాబు పోరాటం
  • నిజంగా వ్యవస్థను భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్సే
  • 26 మంది విద్యార్థులు చనిపోతే కేసీఆర్ పరామర్శించలేదు

దేశంలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీల నాయకత్వంలో రెండు కూటములు ఉన్నాయని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. 21 ప్రాంతీయ పార్టీలను కలుపుకుని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశాన్ని ఉద్ధరించడానికి వెళుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘నిజంగా వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరండీ? 26 మంది విద్యార్థులు చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించకుండా దేశ సమస్యలపై పోరాడుతానని చెప్పే వ్యక్తి గురించి ప్రజలే ఆలోచించుకోవాలి’ అని యామిని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈరోజు యామిని మాట్లాడారు. ఓ రాజకీయ నేతగా కేసీఆర్ ఎవరినైనా కలవొచ్చనీ, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని యామిని అన్నారు. కానీ చంద్రబాబు జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలను కలుపుకునిపోతున్నారు కాబట్టి ‘నేను అలాగే చేస్తా. నేనేంటో నిరూపించుకుంటా’ అని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు.

గత 40 ఏళ్ల చరిత్రలో ఇలా రెండుసార్లు ప్రాంతీయ పార్టీలను కలిపి రెండు సార్లు ప్రధానిని నిలబెట్టిన ఘనత చంద్రబాబుదేనని యామిని ప్రశంసించారు. రాబోయే ఐదేళ్లు కూడా చంద్రబాబే సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు.

More Telugu News