Telangana: తెలంగాణలో దారుణం.. వరికుప్పపైనే ప్రాణాలు విడిచిన రైతన్న!

  • కామారెడ్డి జిల్లా లక్ష్మాపూర్ లో ఘటన
  • ఐదు రోజులుగా అధికారుల కోసం నిరీక్షణ
  • మనోవేదన, వడదెబ్బతో దుర్మరణం

ఆరుగాలం కష్టించి వరి పంటను పండించాడు. అమ్ముకుంటే అప్పులు తీరుతాయనీ, భార్యాపిల్లలను సుఖంగా చూసుకోవచ్చనీ ఆశపడ్డాడు. అయితే ఓవైపు అధికారులు కనికరించకపోవడం, మరోవైపు ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఆ రైతన్న వరి కుప్పపై ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని లక్ష్మాపూర్ లో గోపాల్(50) అనే రైతు వరిపంటను సాగుచేశాడు. పంట చేతికొచ్చాక వరికుప్పను సిద్ధం చేసి అమ్మేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాడు. ఈ క్రమంలో గత 5 రోజులుగా కొనుగోలు అధికారుల కోసం గోపాల్ పడిగాపులు కాస్తున్నాడు. ఓవైపు తన పంట అమ్ముడుపోలేదన్న బాధ, మరోవైపు తీవ్రమైన ఎండ, వేడిగాలులకు గోపాల్ సొమ్మసిల్లి పడిపోయాడు. అయితే ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు వరికుప్పపై అచేతనంగా పడిపోయి ఉన్న గోపాల్ ను గుర్తించి కదపగా, ఆయన నుంచి స్పందన రాలేదు.

వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో గోపాల్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా గోపాల్ చనిపోవడానికి వ్యవసాయ అధికారులే కారణమనీ, వారే పంటను కొనుగోలు చేయలేదని గొడవకు దిగారు. అయితే ఈ వ్యవహారంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు. పంటను కొనుగోలు చేస్తామని తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తేల్చిచెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News