Om Prakash Rajbhar: బీజేపీ నా పార్టీని ఫినిష్ చేయాలని చూస్తోంది: సంచలన వ్యాఖ్యలు చేసిన ఎస్‌బీఎస్‌పీ చీఫ్

  • బీజేపీ గుర్తుపై పోటీ చేయాలంటూ బలవంతం చేస్తున్నారు
  • రాజ్‌భర్ ఓట్ల కోసం వారు నన్ను వాడుకుంటున్నారు
  • మిత్రపక్షాలకు బీజేపీ గౌరవం ఇవ్వడం లేదు

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినట్టు సోమవారం ప్రకటించిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీని అంతం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ‘‘నేను బీజేపీ గుర్తుపై పోటీ చేయాలంటూ ఆ పార్టీ నేతలు బలవంతం చేస్తున్నారు. నాకంటూ ఓ సొంతపార్టీ ఉన్నప్పుడు నేనెందుకు ఆ పార్టీ గుర్తుపై పోటీ చేయాలి?’’ అని రాజ్‌భర్ ప్రశ్నించారు. సీట్ల పంపకాల విషయంలో బీజేపీ నిర్ణయం కోసం చాలాకాలం వేచి చూశానన్న ఆయన అధికార పార్టీ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోందన్నారు.

‘‘నాకు ఇప్పటికి అర్థమైంది. రాజ్‌బర్ ఓట్ల కోసం వారు నన్ను వాడుకోవాలని చూస్తున్నారు. కానీ మాకు సీట్లు ఇవ్వరు. పోస్టర్లలో మాత్రం మా ఫొటోలు వేసి ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయమై ఈసీకి ఫిర్యాదు చేశాను. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

మిత్రపక్షాలను బీజేపీ నేతలు గౌరవించడం లేదని, ఎన్నికల్లో గెలిచేందుకు వారిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీ విజయానికి తామే కారణమని రాజ్‌భర్ పేర్కొన్నారు.

More Telugu News