Andhra Pradesh: పోలవరం పూర్తయితే ఏపీలో 80 శాతం పొలాలకు సాగునీరు అందుతుంది!: ఉండవల్లి అరుణ్ కుమార్

  • ఏపీకి అన్యాయంపై కొత్త ప్రభుత్వం చర్చించాలి
  • దేవినేని ఉమ 2018లోనే నీళ్లు ఇస్తా అన్నారు
  • మరొకరు విజయవాడకు వస్తే కొడతారని హెచ్చరించారు
  • విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఉండవల్లి 

ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ, అప్పుడు పెట్టిన 9800 సవరణలు, కేంద్రం పరిగణనలోకి తీసుకున్న విషయాలపై మే 23 తర్వాత ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం చర్చించాలని సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. పోలవరం ప్రాజెక్టును ఏపీకి స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ తెలంగాణకు ఇస్తున్నాం కాబట్టి ఆంధ్రాకు పోలవరం ఇస్తున్నామని కేంద్రం చెప్పిందన్నారు. నిజంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అది గిఫ్టేననీ, ఎందుకంటే ఆంధ్రా, రాయలసీమలోని 80 శాతం భూమికి సాగునీరు అందుతుందని అభిప్రాయపడ్డారు

విజయవాడలో ఈరోజు ఏర్పాటుచేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఉండవల్లి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మీరు వెళుతున్న పద్ధతి కరెక్ట్ కాదు. మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పినా వినిపించుకోలేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వస్తాను. అక్కడకు మీ(ఏపీ ప్రభుత్వం) మంత్రులు రానక్కరలేదు. చీఫ్ ఇంజనీర్లు రానక్కరలేదు. నాలెడ్జ్ ఉన్న అటెండర్ ను పంపిస్తే చాలు. వాళ్లతో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలోని ప్రజలందరినీ తరలించి భోజనాలు పెట్టించారు. కానీ నా  సొంత ఖర్చులతో వస్తాను.. నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటే మాత్రం వినిపించుకోవడం లేదు. ఈ విషయంలో చాలా లేఖలు రాశాను. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. నేను తప్పుగా మాట్లాడి ఉంటే అప్పుడే క్షమాపణలు కోరి ఉండేవాడిని.

ఓ ఎమ్మెల్యే నన్ను ‘దమ్ముంటే విజయవాడకు రా.. నిన్ను తరిమితరిమి కొడతారు’ అని హెచ్చరించాడు. ఇంకొరు 2018 కల్లా పోలవరం పూర్తి చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు. అప్పుడు నేను 2018 కాదు..2019 పెట్టుకో అని చెప్పా.

మీరూ ఆ వీడియోలు చూసుంటారు. ఇప్పటికీ ఇంకా నెట్ లో ఉన్నాయి. తాజాగా అదే మంత్రి ఈ జూన్ లో పోలవరం ద్వారా నీటిని ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు నిన్న మాట్లాడుతూ.. 2020, జూన్ లో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని చెబుతున్నారు’ అని మండిపడ్డారు.

More Telugu News