Visakhapatnam District: సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. భక్తులతో కిక్కిరిసిన కొండ.. దర్శనానికి ప్రముఖుల క్యూ

  • ఏడాది పొడవునా చందనంతో కనిపించే స్వామివారు
  • తెల్లవారుజామున ఒంటి గంట నుంచే ప్రారంభమైన పూజాదికాలు
  • తొలి పూజ చేసిన అశోక్‌గజపతి రాజు

ఏడాది పొడవునా చందనంతో కనిపించే సింహాచలం అప్పన్న నేడు నిజరూప దర్శనం ఇవ్వనున్నాడు. స్వామివారి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు, ప్రముఖులు పోటెత్తారు. స్వామి వారికి ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు చందనోత్సవం నిర్వహిస్తారు. దీంతో మంగళవారం అక్షయ తృతీయను పురస్కరించుకుని తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామిని మేల్కొలిపి గంగ ధార నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం బంగారు, వెండి బొరిగెలతో స్వామి దేహంపై కప్పి ఉంచిన చందనాన్ని తొలగించారు.

ప్రత్యేక పూజల అనంతరం స్వామి శిరస్సుపైనా, వక్షస్థలంపైనా చందనం ముద్దలు పెట్టారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, పూసపాటి వంశానికి చెందిన అశోక్‌గజపతి రాజు కుటుంబసమేతంగా వచ్చి తొలి పూజ చేశారు. అనంతరం దర్శనాలు ప్రారంభమయ్యాయి. హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఎంపీ అవంతి శ్రీనివాస్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తదితరులు స్వామిని దర్శించుకున్నారు.

స్వామి దర్శనానికి లక్షలాదిమంది భక్తులు తరలిరావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గంటకు 12 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకునేలా క్యూలు ఏర్పాటు చేశారు. ఎండవేడిమి నేపథ్యంలో చలువ పందిళ్లు వేశారు. నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, అన్న ప్రసాదాల పంపిణీకి సిద్ధంగా ఉంచారు.

More Telugu News