108: మేడ్చల్ జిల్లాలో 108 అంబులెన్స్ సర్వీస్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం... 60 వాహనాలు దగ్ధం

  • ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్న అధికారులు
  • మంటలను సకాలంలో గుర్తించని సిబ్బంది
  • మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపకదళం

మేడ్చల్ జిల్లా దేవరయాంజాల వద్ద ఉన్న 108 అంబులెన్స్ సర్వీస్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 60 అంబులెన్స్ లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.

108 సేవలు అందించే ఈఎంఆర్ఐ సంస్థ ప్రధాన కార్యాలయం శామీర్ పేట సమీపంలోని దేవరయాంజాలలో ఉంది. కొన్ని వాహనాలకు మరమ్మతులు అవసరం కావడంతో వాటిని ఓ పక్కన నిలిపి ఉంచారు. ఆ ప్రదేశంలోనే మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

మంటలు వస్తున్న విషయాన్ని సిబ్బంది గుర్తించే సరికి చాలా ఆలస్యమైపోయింది. అప్పటికే పలు వాహనాలకు మంటలు వ్యాపించడంతో సిబ్బంది వాటిని ఆర్పడానికి విఫలయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో, సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే 60 అంబులెన్స్ లు కాలిబూడిదయ్యాయి.

  • Loading...

More Telugu News