modi: మోదీని ఉద్దేశిస్తూ బాక్సర్ కథను చెప్పిన రాహుల్ గాంధీ

  • మోదీ అనే బాక్సర్ సొంత కోచ్ అద్వానీపైనే పంచ్ లు విసిరారు
  • తర్వాత టీమ్ సభ్యులు గడ్కరీ, జైట్లీలకు పంచ్ లు ఇచ్చారు
  • భివానీలో బాక్సర్ కథ చెప్పిన రాహుల్

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 56 ఇంచుల ఛాతీ ఉన్న బాక్సర్ (మోదీ) సొంత గురువు (అద్వానీ)పైనే పంచెస్ విసిరారని విమర్శించారు. హర్యానాలోని భివానీలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, 'గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ అనే కొత్త బాక్సర్ ను హిందుస్థాన్ బరిలోకి దించింది. 56 ఇంచుల ఛాతీ ఉన్న వ్యక్తి రింగులోకి వచ్చాడు. పేదరికం, రైతు సమస్యలు, అవినీతి అనే బాక్సర్ ను ఆయన ఎదుర్కోవాల్సి ఉంది. దేశ ప్రజలంతా ఈ బాక్సర్ ఎలా ఎదుర్కొంటాడా అని చూస్తున్నారు. ప్రేక్షకుల్లో ఆయన కోచ్ అద్వానీతో పాటు గడ్కరీలాంటి మొత్తం టీమ్ ఉంది.

ప్రేక్షకుల కేరింతలు, లైటింగ్ మధ్య బాక్సర్ వచ్చారు. రావడం రావడంతోనే ఆయన చేసిన పని ఏమిటంటే... తన కోచ్ అద్వానీ ముఖంలోకి చూసి ఒక పంచ్ ఇచ్చాడు. అద్వానీ షాక్ లోకి జారుకున్నారు. అక్కడి నుంచి తన టీమ్ సభ్యులందరినీ ఆ బాక్సర్ వెంటాడాడు. వరుసగా గడ్కరీ, అరుణ్ జైట్లీ ఇలా అందరికీ పంచ్ లు ఇస్తూ వెళ్లాడు.

ఆ తర్వాత అక్కడి నుంచి ప్రేక్షకుల మధ్యలోకి బాక్సర్ వెళ్లాడు. చిన్నచిన్న వర్తకులపై నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) అనే రెండు పంచ్ లు విసిరాడు. ఆ తర్వాత రైతులను వెంబడించాడు'  అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. రింగ్ మధ్యలో నిలబడి ఫైట్ చేయాలనే విషయం ఈ బాక్సర్ కు తెలియదా? బయటకు వచ్చి, అందరికి వరుసబెట్టి పంచ్ లు ఇస్తున్నారని సెటైర్ వేశారు. రాహుల్ చెప్పిన కథకు అక్కడున్న కాంగ్రెస్ అభిమానులంతా హాయిగా నవ్వుకున్నారు.

More Telugu News