aap: గట్టి పోటీ ఇచ్చా.. నేను గెలిచే అవకాశాలున్నాయి: ప్రకాశ్ రాజ్

  • ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నా
  • ప్రాంతీయ పార్టీలు, సంస్కృతులకు ప్రాధాన్యత ఉండాలి
  •  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలు సఫలమౌతాయి

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చానని, తనకు గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ఒక్క పార్టీకే మెజార్టీ ఇస్తే ఏం జరిగిందో అందరూ చూశారని, ప్రాంతీయ పార్టీలు, సంస్కృతులకు ప్రాధాన్యత ఉండాలని కోరారు. పని చేసిన వ్యక్తులను చూసి ప్రజలు ఓటేయాలని సూచించారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని, కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ రాదని జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రస్తావిస్తూ, ఆయన ప్రయత్నాలు సఫలమౌతాయని అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సాధ్వీ ప్రజ్ఞా సింగ్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

More Telugu News