Andhra Pradesh: పోలవరం సాక్షిగా వైసీపీపై పంచ్ లు వేసిన ఏపీ సీఎం చంద్రబాబు!

  • ఈరోజు పోలవరాన్ని సందర్శించిన బాబు
  • పనులు 70 శాతం పూర్తయ్యాయని వ్యాఖ్య
  • కోడ్ కారణంగా పనులు నెమ్మదించాయన్న ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పనుల్లో పురోగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టును పూర్తిచేయగలిగితే రాష్ట్రంలో కరవును జయించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. కొన్నితరాల పాటు సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీని ప్రస్తావించిన చంద్రబాబు నవ్వులు పూయించారు.

పోలవరం డ్యామ్ అనేది బహుళార్థక సాధక ప్రాజెక్టు అని చంద్రబాబు తెలిపారు. ఇది ఆంధ్రుల చిరకాల కోరిక, చిరకాల వాంఛ అని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి 1941 నుంచి ఎన్నికల ముందు మాట్లాడటం, ఆ తర్వాత మర్చిపోవడం జరుగుతోందన్నారు. కానీ 2015లో పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా ప్రారంభం అయ్యాయని వ్యాఖ్యానించారు. తాను 30 సార్లు పోలవరాన్ని సందర్శించానని చెప్పారు. ప్రస్తుతం స్పిల్ వే పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల పోలవరం పనులు కొద్దిగా నెమ్మదించిన మాట వాస్తవమేనన్నారు.

2020, జూన్ నాటికి పోలవరం పూర్తవుతుందని బాబు స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో గ్రావిటీ ద్వారా ఇవ్వడం వీలుకాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలేమీ అడగకపోవడంతో ‘ ఓకే ఇంక.. మీకేమీ డౌట్లు లేవు కదా. ప్రతిపక్ష పార్టీ మాదిరిగా. వాళ్లకు వాళ్లే డౌటు’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులంతా నవ్వేశారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు రాగానే మీడియా మిత్రుల చిరకాల డిమాండ్ అయిన ఇళ్ల స్థలాల కేటాయింపును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

More Telugu News