Guntur District: గుంటూరు శివారులోని చేబ్రోలు హనుమయ్య పొగాకు గోదాముల్లో భారీ అగ్నిప్రమాదం

  • మొత్తం ఐదు గోదాముల్లో రెండింట మంటలు
  • ఘటనా స్థలికి చేరుకున్న ఆరు అగ్నిమాపక శకటాలు
  • మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది

గుంటూరు శివారులోని చేబ్రోలు హనుమయ్య పొగాకు గోదాములో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం ఐదు గోదాముల్లో రెండింటిలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఆరు శకటాలతో ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. నగర శివారు పొత్తూరు సమీపంలో వీరి పొగాకు గోదాములు ఉన్నాయి. తొలుత ఓ గోదాము నుంచి పొగలు రావడంతో గమనించిన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోగా తొలి గోదాములో మంటలు ఎగసిపడడమేకాక మరో గోదాముకు కూడా విస్తరించాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

గుంటూరులో ఉన్న మూడు అధునాత అగ్నిమాపక యంత్రాలతోపాటు తెనాలి, చిలకలూరి పేటలో ఉన్న మరో మూడు యంత్రాలతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శకటాల్లోని నీరు సరిపోక పోవడంతో గోదాము యాజమాన్యం ట్యాంకర్లతో తెప్పించిన నీటిని చిమ్ముతున్నారు.

మిగిలిన మూడు గోదాములకు మంటలు విస్తరించకుండా చూస్తున్నారు.  మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరో మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాకున్నా ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News