Aravind Kejriwal: కేజ్రీవాల్ గూబ గుయ్యిమనిపించింది ఆప్ కార్యకర్తేనంటున్న పోలీసులు... బీజేపీ మద్దతుదారుడంటున్న ఆప్!

  • కేజ్రీపై దాడిచేసింది స్పేర్ పార్టుల వ్యాపారి
  • సీఎం వైఖరిపై విసుగుచెందాడంటున్న పోలీసులు
  • 323 సెక్షన్ కింద కేసు నమోదు

ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతీ నగర్ వద్ద రోడ్ షో నిర్వహిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఓ యువకుడు దాడి చేయడం అందరికీ తెలిసిందే. కేజ్రీవాల్ ఉన్న వాహనం పైకి ఎక్కిన ఆ యువకుడు లాగిపెట్టి ఒక్కటిచ్చుకున్నాడు. దాంతో కేజ్రీవాల్ పక్కకిపడిపోయారు. అనంతరం ఆ యువకుడ్ని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఉతికారేశారు. అయితే, దీనిపై పోలీసుల వాదన భిన్నంగా ఉంది. కేజ్రీవాల్ పై దాడిచేసింది స్పేర్ పార్టుల వ్యాపారం చేసుకునే సురేశ్ అనే యువకుడని, అతడు ఆప్ మద్దతుదారుడేనని పోలీసులు చెబుతున్నారు.

ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ వైఖరితో విసుగుచెంది దాడిచేసినట్టు తెలిపారు. దీన్ని ఆప్ వర్గాలు ఖండించాయి. అతడు తమ పార్టీకి చెందినవాడు కాదని, సురేశ్ బీజేపీ సపోర్టర్ అని అతడి భార్య కూడా అంగీకరిస్తోందని ఆప్ నేతలంటున్నారు. అయితే, ఈ విషయంలో సురేశ్ పై ఆప్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులే అతడిపై సెక్షన్ 323 కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.

More Telugu News