Sachin Tendulkar: తన ఆత్మకథలో మరో ఆసక్తికర విషయం చెప్పిన షాహిద్ అఫ్రిది

  • లంకపై 37 బంతుల్లో వరల్డ్ రికార్డు సెంచరీ
  • లంక బౌలర్లకు చుక్కలు చూపిన వైనం
  • ఆ మ్యాచ్ లో తానాడింది సచిన్ బ్యాట్ తోనట!

అమేయ భుజశక్తి, తిరుగులేని టెక్నిక్ ఉన్నా కొన్ని కారణాల వల్ల పాకిస్థాన్ క్రికెట్ వీరుడు షాహిద్ అఫ్రిదికి ఉపఖండం ఆవల పెద్దగా పేరు రాలేదు. అవి రాజకీయపరమైన అంశాలు కావొచ్చు, జట్టులో అంతర్గత విభేదాలు కావొచ్చు కానీ అఫ్రిది అంటే మొదటినుంచీ ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. తన బ్రాండ్ ఇమేజ్ కారణమైన సంఘటనలను తాజాగా తన ఆత్మకథ గేమ్ చేంజర్ లో వివరించాడీ విధ్వంసక బ్యాట్స్ మన్. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను కెలికి అతడితో చీవాట్లు పెట్టించుకున్న అఫ్రిది ఇప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి తన పుస్తకంలో కొన్ని ప్రస్తావనలు ఉన్నట్టు తెలిపాడు.

1996లో అఫ్రిది అంటే ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలియజెప్పిన ఇన్నింగ్స్ అంటే 37 బంతుల్లో రికార్డు సెంచరీనే అని చెప్పాలి. 1996లో నైరోబీ వేదికగా శ్రీలంకపై అఫ్రిది ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్ తో అతడి పేరు మార్మోగిపోయింది. 11 సిక్సులు, 6 ఫోర్లు బాదాడు. ఆరోజు అఫ్రిది కారణంగా లంక బౌలర్లకు పీడకలలే మిగిలాయి. అయితే, ఆ రోజు తాను ఆడింది సచిన్ బ్యాటుతో అని అఫ్రిది తన ఆత్మకథలో వెల్లడించాడు.

"సచిన్ తనకెంతో ఇష్టమైన బ్యాటు కొలతలతోనే మరో బ్యాటు తయారుచేయించమని వకార్ యూనిస్ కు పాత బ్యాటు ఇచ్చాడు. పాకిస్థాన్ లోని రావల్పిండి అంటే క్రీడా ఉపకరణాల తయారీకి పెట్టింది పేరు. అయితే వకార్ యూనిస్ ఆ బ్యాటును రావల్పిండి తీసుకెళ్లడానికి ముందు నాకిచ్చాడు. ఆ బ్యాటుతోనే లంక బౌలర్లను చితకబాదాను" అంటూ వివరించాడు.

అయితే తన పుస్తకానికి ప్రాచుర్యం కల్పించుకునేందుకు సచిన్ పేరు ఉపయోగించుకున్న ఈ పాకిస్థానీ తన బుద్ధి ఎలాంటిదో చాటుకుంటూ, తాను ప్రకటించిన ఆల్ టైమ్ వరల్డ్ వన్డే జట్టులో సచిన్ కు చోటు కల్పించలేదు.

  • Loading...

More Telugu News