Car: విమానంలో కారును పంపుతున్నామంటే... నమ్మేసి రూ. 2.30 లక్షలు సమర్పించుకున్న హైదరాబాదీ!

  • ఆన్ లైన్ లో కారు కోసం వెతుకులాట
  • తక్కువ ధరకు వస్తుందని అపరిచితుల ఖాతాల్లోకి డబ్బు
  • రాజస్థాన్ సైబర్ నేరగాళ్ల పనేనని తేల్చిన పోలీసులు

సైబర్ నేరాలు పెరిగిపోయాయని, అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోకుండా ఎవరి ఖాతాలకూ డబ్బులు వేయవద్దని పోలీసులు ఎంతగా చెబుతున్నా, అమాయకులు నమ్మి నట్టేట మునిగిపోతూనే ఉన్నారు. తాజాగా, తక్కువ ధరకు కారును అమ్ముతున్నామని, దాన్ని విమానంలో పంపుతామని సైబర్ నేరగాళ్లు చెబితే, రూ. 2.30 లక్షలు సమర్పించుకున్నాడో హైదరాబాద్ యువకుడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, సెకండ్ హ్యాండ్ కారు కోసం వెతుకుతున్న బాధితుడికి ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ లో 2013 మోడల్ స్విఫ్ట్ డిజైర్ రూ. 1.50 లక్షలకే అని కనిపించింది. అక్కడ ఇచ్చిన నంబర్ కు డయల్ చేయగా, వికాస్ పటేల్ అనే వ్యక్తి లైన్ లోకి వచ్చాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని నమ్మబలుకుతూ, డబ్బులు తన ఖాతాలో వేస్తే కారును విమానంలో పంపుతానని అన్నాడు. విమానం చార్జీల నిమిత్తం రూ. 21 వేలు వేయాలని చెప్పడంతో బాధితుడు వికాస్ ఖాతాలో జమ చేశాడు.

ఆపై ఫోన్ చేసిన అతను, హైదరాబాద్ లో తన ఫ్రెండ్ సాహిల్ కుమార్ ఉన్నాడని, అతడే మిగతా వివరాలన్నీ చూస్తాడని చెబుతూ అతని సెల్ నంబర్ ఇచ్చాడు. సాహిల్ కు బాధితుడు ఫోన్ చేయగా, డబ్బిచ్చిన తరువాత కారును అప్పగిస్తానని నమ్మబలకడంతో రూ. 1.50 లక్షలు చెల్లించాడు. ఆపై ఇన్సూరెన్స్‌ డిపాజిట్‌ అని ఇతర చార్జీలని చెబుతూ మరో రూ. 80 వేలు లాగిన తరువాత, జీఎస్టీ కట్టాలని రూ. 30 వేలు పంపాలని చెప్పడంతో అప్పటికిగాని అసలు విషయం తెలిసిరాలేదు. దీంతో లబోదిబో మంటూ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, ఇది రాజస్థాన్ లోని భరత్ పూర్ కేంద్రంగా పని చేస్తున్న సైబర్ క్రైమ్ ముఠా పనేనని తేల్చి కేసు విచారణ చేపట్టారు.

More Telugu News