Hyderabad: అధికార పార్టీనా..మజాకా! నమస్కారం పెట్టలేదని టీఆర్‌ఎస్‌ నాయకుని వీరంగం

  • ఇద్దరు యువకులపై  దాడి
  • బండికి నిప్పంటించిన వైనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు

అసలే అధికార పార్టీ...పైగా స్థానిక నాయకుడు...తన పట్ల కనీస మర్యాద చూపకుంటే ఎలా?...సరిగ్గా ఇలాగే అనుకున్నాడు అతను. ఎదుటపడినా తనపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వెళ్లిపోతున్న యువకుని చెంప చెళ్లుమనిపించాడు ఆ నాయకుడు. అతను వచ్చిన బైక్‌కు నిప్పంటించాడు. హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన ఉమాకాంత్ (20) సమీపంలోని స్నేహితుడి ఇంటికి తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ డివిజన్‌ స్థాయి నాయకుడు అరుణ్‌ ఉన్నాడు. అతన్ని పట్టించుకోకుండా ఉమాకాంత్‌ తన స్నేహితుడి ఇంటికి వెళ్లిపోతుండడం గమనించిన సదరు నాయకుడు యువకుడిని ఆపి చెంప చెళ్లుమనిపించాడు. అతను ఎందుకు కొట్టాడో అర్థంకాక భయపడిన ఉమాకాంత్‌ తాను వచ్చిన ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో మరింత ఆగ్రహం చెందిన అరుణ్‌ అతడి బండికి నిప్పంటించాడు.

పారిపోయిన ఉమాకాంత్‌ తన మిత్రుడు దుర్గతో కలిసి తిరిగి ఘటనా స్థలికి వచ్చాడు, కాలిపోతున్న తన బైక్‌ను చూసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన అరుణ్‌, అతని సోదరులు అనిల్‌, మహేష్‌లు దుర్గపైనా దాడిచేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ శేఖర్‌ అక్కడికి చేరుకుని అరుణ్‌, అతని సోదరులను అవుట్‌ పోస్టుకు తరలించారు. అక్కడ పోలీసులతోనూ వారు గొడవపడ్డారు. శనివారం ఘటనపై విచారణ జరిపిన బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు  బాధితుని ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News