Andhra Pradesh: అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.. ఆపై ఆత్మహత్య.. విజయవాడలో కలకలం

  • పెళ్లైన తొలి రోజు నుంచే భార్యపై అనుమానం
  • ఇద్దరు పిల్లలు పెళ్లిళ్లు చేసినా భార్యపై అనుమానం
  • నిద్రపోతున్న భార్యపై దాడి చేసి హతమార్చిన వైనం
మూడు దశాబ్దాల క్రితం పెళ్లాడిన భార్యపై అనుమానం పెంచుకున్నాడో ప్రబుద్ధుడు. అది కాస్తా పెనుభూతంగా మారడంతో గొడ్డలితో ఆమెను దారుణంగా నరికి చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక జక్కంపూడి కాలనీకి చెందిన అవనిగడ్డ నరసింహారావు- కృష్ణకుమారి భార్యాభర్తలు. 30 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది. వెల్డింగ్ పనులు చేసి కుటుంబాన్ని పోషించే నరసింహారావుకు మొదటి నుంచి భార్యపై అనుమానం ఉండేది.

తమకు పుట్టిన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసినా ఆ అనుమానం వీడకపోగా, మరింత పెద్దదైంది. మూడు రోజుల క్రితం కృష్ణకుమారి తన అక్క ఇంటికి వెళ్లి శుక్రవారం రాత్రి ఇంటికొచ్చింది. భోజనం చేసి నిద్రపోతున్న ఆమెను చూసిన భర్త నరసింహారావు గొడ్డలితో ఆమెపై దాడిచేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. అయితే, తెల్లారితే విషయం బయటపడి అందరికీ తెలిసిపోతుందన్న భయంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అదే కాలనీలో ఉంటున్న వారి కుమారుడు ఉదయం ఇంటికి రావడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Vijayawada
murder
suicide

More Telugu News