everest: హిమాలయాల్లో కూడా పంజా విసురుతున్న ఫణి తుపాను

  • హిమాలయాల్లో భీకర గాలులు
  • ఎవరెస్ట్ బేస్ క్యాంపులో ఎగిరిపోయిన టెంట్లు
  • టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన నేపాల్ ప్రభుత్వం

ఫణి తుపాను ఒడిశాపై తీవ్ర ప్రభావాన్ని చూపిన సంగతి తెలిసిందే. అయితే, తూర్పు తీరానికి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న హిమాలయా పర్వతాల్లో సైతం తన పంజా విసురుతోంది. ఫణి ప్రభావం కారణంగా వీస్తున్న బలమైన గాలులకు ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపులో ఉన్న దాదాపు 20 టెంట్లు ఎగిరిపోయాయి. మరికొన్ని పాడైపోయాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేసింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. టూరిస్టుల భద్రత పట్ల ట్రెక్కింగ్ ఏజెన్సీలు, వారి సపోర్ట్ స్టాఫ్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

బలమైన గాలుల వల్ల కొన్ని టెంట్లు ఎగిరిపోయాయనే సమాచారం అందిందని, అయితే పర్వతారోహకులు, సపోర్ట్ స్టాఫ్ అందరూ క్షేమంగానే ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖకు అనుబంధంగా ఉండే పర్వతారోహక విభాగం డైరెక్టర్ ఆచార్య తెలిపారు. పరిస్థితి మెరుగుపడేంత వరకు అందరూ సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండిపోవాలని కోరారు.

నేపాల్ పై తుపాను ప్రభావం నేరుగా లేకపోయినప్పటికీ... అక్కడి వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా నేపాల్ తూర్పు ప్రాంతంలోని వాతావరణం మార్పుకు గురవుతోంది. విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో, హెలికాప్టర్ ప్రయాణాలను కూడా నిషేధించారు.

More Telugu News