Prakash Raj: మోదీ ఏమైనా నా మామ గారా!... గొడవలు ఉండడానికి!: ప్రకాశ్ రాజ్

  • తప్పు చేస్తున్నవాళ్లను నిలదీస్తే మోదీ పేరు చెబుతున్నారు
  • మోదీని ప్రశ్నించక పక్కింటివాళ్లను అడగమంటారా?
  • ఢిల్లీలో ప్రకాశ్ రాజ్ ప్రెస్ మీట్

ప్రముఖ నటుడు, ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రకాశ్ రాజ్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో మీకు ఎందుకు విభేదాలొచ్చాయి? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో, ఆయనేమైనా నాకు మామ గారా! గొడవలు రావడానికి! అంటూ సమాధానమిచ్చారు. వివాదాలు రావడానికి ఇద్దరి మధ్య పొత్తులు కుదరకపోవడంలాంటివేమీ లేవని చమత్కరించారు.

ఆయన ఓ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడని, తప్పులు చేస్తున్న ఆ పార్టీవాళ్లను నిలదీస్తే మోదీ పేరు చెబుతున్నారని, అందుకే తాను మోదీని ప్రశ్నిస్తున్నానని ప్రకాశ్ రాజ్ వివరణ ఇచ్చారు. "భలేవాళ్లే మీరు! ఆయన పార్టీకి సంబంధించిన వాళ్లు తప్పు చేస్తే మోదీని నిలదీయక పక్కింటివాళ్లను అడగమంటారా?" అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ప్రజ్ఞా ఠాకూర్ లాంటి వాళ్లు మోదీ పక్షాన నేతలుగా వెలుగొందుతున్నారని, ఆమె బెయిల్ పై బయటికొచ్చి ఏవిధంగా మాట్లాడుతుందో చూడండి అంటూ మండిపడ్డారు. బాబ్రీ మసీదును తానే కూల్చానని చెబుతోందని, అప్పటికి ఆమె వయసు నాలుగేళ్లు ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సైతం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారని, ఆయన ఆరోపణలు చేసినంత మాత్రాన అవన్నీ నిజాలు అనుకోనవసరంలేదని అన్నారు.

"ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నేను వద్దనడం కాదు దేశమే వద్దనుకుంటోంది. ఆ రెండు పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ప్రధాని కావడం సాధ్యమే. ఓ నియోజకవర్గంలో ఓటరు అక్కడి అభ్యర్థిని మాత్రమే ఎన్నుకుంటాడు తప్ప నేరుగా ప్రధానిని ఎన్నుకోడు. గెలిచిన అభ్యర్థులే ప్రధానిని నిర్ణయిస్తారు. ఉత్తరాదిలో మోదీని చూసి ఓటేయమని బీజేపీ చెబుతోంది. అలాగైతే ఆయనే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయొచ్చుకదా!" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఒకవేళ సంకీర్ణం వచ్చినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఒకదాని మద్దతు అవసరమైతే ఏ పార్టీ నుంచి మద్దతు తీసుకుంటారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, "చూద్దామండీ! పిల్ల పుట్టకముందే పేర్లు పెట్టడం ఎందుకు‌?‌ ముందు పిల్ల పుట్టనివ్వండి ఆడో, మగో తెలుసుకుందాం!" అంటూ తనదైన శైలిలో చమత్కరించారు. కాగా, ప్రకాశ్ రాజ్ ఈ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News