Heat waves: ఫణి తుపాన్‌ వెళ్లింది... వడగాల్పులు, ఉక్కపోత మొదలు!

  • కోస్తా, రాయలసీమ, తెలంగాణలో ఒకేసారి పెరిగిన ఉష్ణోగ్రతలు
  • ఉత్తరాంధ్రలోనూ ఊహించని మార్పు
  • సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు నిలిచిపోవడమే కారణం
సాధారణంగా తుపాన్‌ వర్షాల అనంతరం కనీసం రెండు మూడు రోజుల పాటు వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఫణి తుపాన్‌ మాయాజాలం పుణ్యాన తుపాన్‌ శుక్రవారం ఉదయానికి ఇలా తీరం దాటిందో లేదో.. అలా ఉష్ణోగ్రతలు జోరందుకున్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని  ఉత్తరాంధ్ర మినహా కోస్తా, రాయలసీమ జిల్లాల్లోను, తెలంగాణలోను ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి అనంతపురం వరకు వేసవి సెగలు కక్కింది. ప్రకాశం జిల్లా గూడూరులో అత్యధికంగా 45.79 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కావలిలో 44.6 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత కాగా దానిని మించిన ఉష్ణోగ్రత నిన్న నమోదయింది.

తుపాన్‌ ఒడిశా వద్ద తీరం దాటడంతో సముద్రం మీదుగా ఏపీ మీదికి వీచే తేమగాలులు నిలిచిపోయాయి. అదే సమయంలో మధ్య భారతం నుంచి వచ్చే పొడిగాలుల ప్రభావంతో ఒక్కసారిగా కోస్తా వేడెక్కింది. ఆ ప్రభావం రాయలసీమపైనా కనిపించింది. సాధారణంగా మే నెల రెండో వారంలో వీచే వడగాల్పులు తుపాన్‌ ప్రభావం కారణంగా తొలివారమే వచ్చాయని ఆర్టీజీ, ఇస్రో నిపుణులు చెబుతున్నారు.

రానున్న రెండు మూడురోజులు కూడా తూర్పుగోదావరి నుంచి రాయల సీమ వరకు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం పూట ఎండలో తిరగకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాలని వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర అధికారులకు సమాచారం అందించారు.

శుక్రవారం ఏపీలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు-43.7, జంగమహేశ్వరపురం- 43.2, మచిలీపట్నం- 43.1, బాపట్ల-43, తిరుపతి- 42.8 , నెల్లూరు-42.3 , నందిగామ- 42.1 , విజయవాడ-41.9 , కాకినాడ-41.8 , కర్నూలు-40 డిగ్రీలు నమోదయ్యాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి తదితర జిల్లాల్లోనూ వడగాల్పులు వీస్తున్నాయి. 
Heat waves
phani effect
high tepmparature

More Telugu News