Tammareddy Bharadwaj: రాష్ట్రంలో తమను ఏమీ చేయనివ్వడం లేదని చంద్రబాబు అంటున్నారు, మరి వర్మ ప్రెస్ మీట్ ను అడ్డుకున్నది ఎవరు?: తమ్మారెడ్డి భరద్వాజ

  • కొత్తగా వచ్చిన సీఎస్ తిప్పి పంపారా?
  • వర్మ ఏమన్నా ఉగ్రవాదా?
  • విమర్శలు చేసిన తమ్మారెడ్డి

టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై వ్యాఖ్యానించారు. కేంద్రం జోక్యంతో కొత్త సీఎస్ ను తీసుకువచ్చారని, రాష్ట్రంలో తమను ఏమీ చెయ్యనివ్వడం లేదని చంద్రబాబు అంటున్నారని, మరి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విజయవాడ నుంచి తిప్పి పంపించిందెవరు? అంటూ ప్రశ్నించారు.

బెజవాడలో వర్మ మీడియా సమావేశాన్ని అడ్డుకున్నది ఎవరు? కొత్తగా వచ్చిన సీఎస్ ఆ పనిచేశారా? లేక, రాష్ట్ర ప్రభుత్వమే వర్మ ప్రెస్ మీట్ ను ఆపిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం వర్మ ప్రెస్ మీట్ పెట్టుకోవడంలో తప్పులేదని, ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్ తిప్పి పంపాల్సిన అవసరం ఏముందో తనకు అర్థం కావడంలేదని అన్నారు. వర్మ ఏమన్నా ఉగ్రవాదా? నక్సలైటా? లేక, దేశద్రోహా? అని నిలదీశారు.

అయినా, ఒక సినిమా విషయంలో చంద్రబాబు భయపడడం ఏంటో తెలియడంలేదన్నారు. ఇన్నాళ్లు ధైర్యంగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడేమైందని ప్రశ్నించారు. చంద్రబాబు భయపడాల్సింది ఇప్పుడు కాదని, ఆనాడు ఎన్టీఆర్ తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన సమయంలో వచ్చిన ఆరోపణల పట్ల భయపడి ఉండాలని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ ఆరోపణలపై పోరాటం చేసి మళ్లీ సీఎం అయిన చంద్రబాబు ఇప్పటివరకు ఎంతో ధీమాగా ఉన్నారని, వర్మ అనే చిన్న వ్యక్తి తీసిన సినిమా కారణంగా భయపడడం బాగా లేదని అన్నారు. అయినా ఇప్పుడా సినిమా ఏం చేస్తుంది? ఎన్నికలు కూడా ముగిశాయి, అలాంటప్పుడు సినిమాను అడ్డుకోవాల్సిన పనేముంది? అంటూ ప్రశ్నించారు.

More Telugu News