MSK prasad: టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే పేరుతో డబ్బులు వసూలు చేసిన రంజీ క్రికెటర్‌కు అరదండాలు

  • ఎమ్మెస్కేలా మాట్లాడుతూ మోసం చేస్తున్న నాగరాజు
  • 82 గంటలపాటు ఏకధాటిగా క్రికెట్ ఆడి రికార్డు
  • ఈజీ మనీ కోసం మోసాలు

టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో ఏపీ, తెలంగాణలో పలువురు ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేసిన రంజీ ఆటగాడు బుడుమూరు నాగరాజు (24)ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన నాగరాజు విశాఖపట్టణంలో ఉంటున్నాడు. ఎంబీఏ చదువుకున్న నాగరాజు మంచి క్రికెటర్ కూడా. 2014లో ఆంధ్రా తరపున రంజీల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఏకధాటిగా 82 గంటలపాటు క్రికెట్ ఆడి రికార్డులకెక్కాడు.

నాగరాజులో చాలా ప్రతిభ దాగి ఉందని గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు స్పాన్సర్‌షిప్‌కు ముందుకు వచ్చాయి. చేతినిండా డబ్బులు ఉండడంతో జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మరింత డబ్బును సులభంగా సంపాదించేందుకు దొంగగా మారాడు. ఓసారి బహుమతి ప్రదానోత్సవానికి ఎమ్మెస్కే హాజరయ్యాడు. ఆయన మాటతీరును క్షుణ్ణంగా పరిశీలించిన నాగరాజు ఆయనలా మాట్లాడడం నేర్చుకున్నాడు. తన ఫోన్ నంబరును ట్రూకాలర్‌లో ఎమ్మెస్కే ప్రసాద్‌గా మార్చి పెట్టుకున్నాడు.

అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్‌లా పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసి మోసం చేయడం మొదలుపెట్టాడు. నాగరాజు అనే కుర్రాడు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎంపికయ్యాడని, అతడికి డబ్బు ఇవ్వాలంటూ హైదరాబాద్‌లోని సెలక్ట్ మొబైల్ షాపు యజమాని మురళికి ఫోన్‌చేసి చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మురళి రూ.2.28 లక్షలను ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. అలాగే, విజయవాడ రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యాజమాన్యానికి ఫోన్‌ చేసి రూ.3.88 లక్షలు దండుకున్నాడు.

విషయం తెలిసిన ఎమ్మెస్కే ప్రసాద్ హైదరాబాద్, విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగరాజు బాగోతాలు వెలుగుచూశాయి. ఎమ్మెస్కే పేరుతో నాగరాజే ఈ మోసాలకు పాల్పడుతున్నాడని నిర్ధారించిన విజయవాడ పోలీసులు గురువారం ఉదయం గన్నవరంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి లక్ష రూపాయల విలువ చేసే ఓ బైక్, రూ.80,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News