Andhra Pradesh: అలా అయితే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అర్ధమే లేదు: సీఎం చంద్రబాబు

  • భారత ఎన్నికల సంఘానికి  లేఖ రాశాను
  • ఏపీలో ఎన్నికలు ముగిశాయి
  • ఓటర్లను ప్రభావితం చేసే ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది?

తుపాన్ ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల నియమావళిని సడలించాలని భారత ఎన్నికల సంఘానికి తాను లేఖ రాసిన విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కష్ట సమయంలో ప్రజల ఇబ్బందుల్ని చూసి పరిష్కరించకుండా ఎన్నికల నియమావళి పేరుతో మౌనంగా ఉండిపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అర్థమే లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

 అవసరమైతే తాను క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వెళ్తానని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నానని, దీనిపై ఇంత వరకు వారి నుంచి స్పందన లేదని విమర్శించారు. కనీసం విపత్తులు ఎదురైనప్పుడు అత్యవసర సందర్భాల్లోనైనా వారు స్పందించాలని కోరారు. ఏపీలో ఎన్నికలు ముగిశాయని, పోలింగ్ ప్రక్రియ పూర్తయినందున ఓటర్లను ప్రభావితం చేసే ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇటువంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, గతంలో తుపాన్ విపత్తు సమయంలో రూ.30 కోట్ల విలువైన సామగ్రిని ఒడిశాకు పంపించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. అవసరమైతే ఇప్పుడూ అదే సహాయాన్ని కొనసాగించాలని అధికారులతో చెప్పినట్టు పేర్కొన్నారు.

‘ఫణి’ సహాయక చర్యల కోసం కొత్తగా జీవోలు జారీ చేయాల్సిన అవసరం లేదని, మళ్లీ వాటి కోసం ఈసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అత్యవసరాల్లో అన్నీ సంప్రదాయంగా, ముతక పద్ధతుల్లో చేస్తామంటే ప్రజలు ఇబ్బంది పడతారని, ‘తిత్లీ’ సమయంలో జారీ చేసిన ఆదేశాలనే ఇప్పుడు కూడా అనుసరించవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News