Mukesh Ambani: అనిల్ అంబానీకి ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు!

  • ఎరిక్సన్ కు డబ్బు కట్టిన అనిల్ అంబానీ
  • గతంలో నమోదైన కోర్టు ధిక్కరణ అభియోగాల తొలగింపు
  • తమ్ముడిని ఆదుకున్న ముఖేష్ అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త, అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) సంస్థల చైర్మన్ అనిల్‌ అంబానీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన చైర్మన్ గా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు, ఎరిక్సన్‌ ఇండియాకు మధ్య ఉన్న వివాదంలో అనిల్ అంబానీపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును న్యాయస్థానం బుధవారం నాడు కొట్టేసింది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ. 453 కోట్లను చెల్లించడంతోనే ధిక్కరణ కేసును తొలగిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. కాగా, అనిల్ సోదరుడు, ఇండియాలో అత్యధిక ధనవంతుడైన ముఖేష్‌ అంబానీ బాసటగా నిలవడంతో అనిల్ డబ్బు కట్టగలిగారన్న సంగతి తెలిసిందే.

అన్నకు చెందిన రిలయన్స్‌ జియోకు ఆస్తులు విక్రయించి కూడా తమకు చెల్లించాల్సిన బకాయిలను రిలయన్స్ కమ్యూనికేషన్స్ చెల్లించడం లేదని ఎరిక్సన్‌ ఓ పిటిషన్ ను దాఖలు చేయగా, అనిల్‌ అంబానీ, రిలయన్స్‌ టెలికం చైర్మన్‌ సతీష్‌ సేథ్‌, రిలయన్స్‌ ఇన్‌ ఫ్రాటెల్‌ చీఫ్‌ ఛాయా విరానీలను నిందితులుగా చేరుస్తూ, పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే వారిపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదయ్యాయి. ఆ సమయంలో నాలుగు వారాల గడువునిచ్చిన అత్యున్నత ధర్మాసనం ఎరిక్సన్‌ ఇండియాకు రూ. 453 కోట్లను చెల్లించకుంటే, మూడు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాలని హెచ్చరించింది. ఇప్పుడు చెల్లింపు పూర్తి కావడం, ఆ విషయాన్ని ఎరిక్సన్ కోర్టుకు తెలియజేయడంతో కోర్టు థిక్కరణ అభియోగాలను రద్దు చేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.

More Telugu News