Supreme Court: సీజేఐ రంజన్ గొగోయ్ పై కుట్ర ప్రశాంత్ భూషణ్ పనే!: ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ ఆరోపణ

  • ఇందిరా జైసింగ్ హస్తం కూడా ఉందన్న శర్మ
  • మరో ధర్మాసనం ముందు ప్రస్తావించాలన్న గొగోయ్
  • జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లిన శర్మ

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపులు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి సాక్షాత్తు సీజేఐపై తీవ్ర ఆరోపణలు చేయడం అనేక సందేహాలు రేకెత్తించింది. దీనిపై, ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ సంచలన ఆరోపణలతో వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.

రంజన్ గొగోయ్ పై కుట్రకు పాల్పడింది సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంటూ తీవ్ర కలకలం రేపారు. ఆయనకు మరో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కూడా సహకరించారని, ఇద్దరూ కలిసి ఓ మహిళతో సీజేఐపై ఆరోపణలు చేయించారని శర్మ ఆరోపించారు. దీనికి సంబంధించి మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయంటూ తన వాదనలకు బలం చేకూర్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట తన అనుమానాలను వ్యక్తం చేశారు.

అయితే, ఇది తన వ్యక్తిగతానికి సంబంధించిన విషయం కావడంతో, సుప్రీం కోర్టులోనే మరో ధర్మాసనానికి నివేదించాలని రంజన్ గొగోయ్ న్యాయవాది ఎంఎల్ శర్మకు సూచించారు. దాంతో శర్మ జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ ఎదుట తాజా ప్రస్తావనలు తీసుకువచ్చారు. సీజేఐపై ఉద్దేశపూర్వకంగానే కుట్ర పన్నారని, దీనిపై పిటిషన్ దాఖలు చేస్తానని, వెంటనే విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరారు.

అయితే, అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం శర్మ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించలేదు. కానీ, సీజేఐ వ్యవహారంలో దేశంలో ఉన్న సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ పేరు వినిపించడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

More Telugu News