Vijay Sai Reddy: చివరాఖర్లో చంద్రబాబు చేసిన ఘోర తప్పిదే: విజయసాయి రెడ్డి

  • గద్దె దిగాక తప్పులు వెంటాడుతాయి
  • సీఎస్ ను దూషిస్తున్న చంద్రబాబు
  • కౌంటింగ్ పక్కాగా సాగాలని ఈసీకి లేఖ

మరికొన్ని  రోజుల్లో పదవిని పోగొట్టుకోనున్న చంద్రబాబునాయుడు చివరిలోనూ తప్పులు చేస్తున్నారని, గద్దె దిగిన తరువాత అవన్నీ వెంటాడుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. "చివరాఖరున చంద్రబాబు చేసిన మరో ఘోర తప్పిదం సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం గారిని దూషించడం. ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది సారుకు. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు రేపు గద్దె దిగిన తర్వాతా బాబును వెంటాడతాయి" అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో నిప్పులు చెరిగారు.

కాగా, కౌంటింగ్ రోజున నకిలీ ఫామ్-17లను తీసుకురావడం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లెక్కింపునకు అడ్డు పడాలని ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయి రెడ్డి లేఖను రాశారు. కౌంటింగ్ ప్రక్రియకు టీడీపీ ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకూ ఈసీ నియమించిన అబ్జర్వర్లు కౌంటింగ్ హాల్ లోనే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. కౌంటింగ్ ఏజంట్ల నియామకాన్ని సైతం ముందుగానే పూర్తి చేయాలని కోరారు.

కౌంటింగ్ కేంద్రంలోనికి వెళ్లే అందరు ఏజంట్లనూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఈవీఎంల వద్దకు ఏజంట్లు వెళ్లకుండా స్టీల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. 144 సెక్షన్ అమలు పక్కాగా ఉండాలని, పోలీసులపై టీడీపీ పెద్దలు ఒత్తిడి తేకుండా చూడాలని ఆయన ఈసీకి రాసిన లేఖలో అభ్యర్థించారు. బందోబస్తుకు కేంద్ర బలగాలను మాత్రమే వినియోగించాలని కోరారు.




  • Loading...

More Telugu News