brazil: క్యాట్ వాక్ చేస్తూ ర్యాంప్ పైనే కుప్పకూలిన మోడల్.. ఆసుపత్రికి తరలించేలోపే దుర్మరణం!

  • బ్రెజిల్ లోని సౌపాలో నగరంలో ఘటన
  • క్యాట్ వాక్ చేస్తూ ఒక్కసారిగా పడిపోయిన సోరెస్
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
సాధారణంగా మోడల్స్ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడానికి కొన్నిసార్లు మంచినీళ్లు, పండ్ల రసాలతో కడుపు నింపుకుంటారు. తాజాగా బ్రెజిల్ లో ఓ పురుష మోడల్ క్యాట్ వాక్ చేస్తూ ర్యాంప్ పైనే కుప్పకూలిపోయాడు. ఆయన్ను నిర్వాహకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బ్రెజిల్ లోని  సౌపాలో నగరంలో గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బ్రెజిల్ కు చెందిన మోడల్ టేల్స్ సోరెస్(26) శనివారం రాత్రి జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ర్యాంప్ పై ఓ వైపుకు వెళ్లిన సోరెస్, తిరిగి వెనక్కి వెళుతూ ఒక్కసారిగా పడిపోయాడు. అయితే ఇదంతా షోలో భాగమేనని కార్యక్రమానికి హాజరైన వారంతా భావించారు. అయితే నిర్వాహకులు హుటాహుటిన అంబులెన్సులో సోరెస్ ను తరలించడంతో అంతా కంగుతిన్నారు. కాగా, సోరెస్ ఎందుకు చనిపోయాడన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాలేదు. మరోవైపు సోరెస్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఫ్యాషన్ వీక్ సంస్థ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.
brazil
model
sores
dead
fell on ramp
cat walk

More Telugu News