lakshman: తెలంగాణ సమాజం విచిత్రమైన పరిస్థితుల్లో కొనసాగుతోంది: లక్ష్మణ్

  • విద్యార్థులు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు
  • 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి తప్పిదాలను చూడలేదు
  • రాష్ట్రాన్ని బలిదానాల తెలంగాణగా మార్చుతున్నారు

పరీక్ష ఫలితాలతో ఇంటర్ విద్యార్థులు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారని... అయినా ఇంటర్ బోర్డు అవకతవకల విషయంలో ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ సమాజం విచిత్రమైన పరిస్థితుల్లో కొనసాగుతోందని అన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘోర తప్పిదాలను ఎన్నడూ చూడలేదని చెప్పారు.

 బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు... రాష్ట్రాన్ని బలిదానాల తెలంగాణగా మార్చుతున్నారని విమర్శించారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయం వద్ద లక్షణ్ ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బండారు దత్తాత్రేయ, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, మురళీధర్ రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పిల్లల హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ దీక్షను భగ్నం చేసేందుకు బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ చాటున తమ పార్టీ కార్యాలయానికి రావాల్సి వచ్చిందని... రాష్ట్రంలో ఇంత దారుణమైన ప్రభుత్వం ఉందని అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తల్లిదండ్రుల విశ్వాసాన్ని కోల్పోవద్దని చెప్పారు. న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

More Telugu News