Amarnath: అనూహ్యం... రెండు నెలలకు ముందే అమర్ నాథ్ లో మంచులింగం ఆవిర్భావం... తొలి చిత్రాలు విడుదల!

  • జూలై నుంచి ప్రారంభం కావాల్సిన యాత్ర
  • రెండు నెలలకు ముందే వెళ్లిన 8 మంది
  • అధికారికంగా ధ్రువీకరించని ఎస్ఏఎస్బీ

స్వయంభూ మంచు లింగం కొలువయ్యే హిమాలయ సాణువుల్లోని అమర్ నాథ్ గుహలో అనూహ్యంగా రెండు నెలలకు ముందే మంచులింగం దర్శనమిస్తోంది. వాస్తవానికి జూలై నుంచి ఆగస్టు మధ్య అమర్ నాథ్ యాత్ర సాగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే, కొంతమంది భక్తులు ఏప్రిల్ నాలుగో వారంలో అమర్ నాథ్ యాత్ర చేపట్టారు.

అక్కడ తమకు 15 అడుగుల ఎత్తయిన హిమలింగం కనిపించిందని చెబుతూ, దాని చిత్రాలను విడుదల చేశారు. ఇవి నాలుగు రోజుల క్రితం తీసినవిగా తెలుస్తోంది. మొత్తం ఎనిమిది మంది ఈ నెల 20 నుంచి 25 మధ్య యాత్రను చేశామని, ఈ సంవత్సరం తొలిసారిగా స్వామిని దర్శించుకున్నది తామేనని వారు చెబుతున్నారు.
కాగా, ఈ యాత్రను ప్రతి సంవత్సరమూ ఎస్ఏఎస్బీ (శ్రీ అమర్ నాథ్ జీ షరైన్ బోర్డ్) నిర్వహిస్తుంది. ఎస్ఏఎస్బీ అధికారులే ఈ సంవత్సరం ఇంతవరకూ గుహను సందర్శించలేదు. దీంతో ఈ ఎనిమిది మంది అమర్ నాథ్ యాత్రపై అధికారిక ధ్రువీకరణ అందలేదు.46 రోజుల పాటు సాగే అమర్ నాథ్ యాత్ర, ఈ సంవత్సరం జూలై 1న మాస శివరాత్రి నుంచి ఆగస్టు 15న వచ్చే శ్రావణ పూర్ణిమ, రాఖీ పండగ వరకూ కొనసాగుతుంది. ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, యస్ బ్యాంకుల ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో రోజుకు 7,500 మంది యాత్రికులను ఈ సంవత్సరం అమర్ నాథ్ కు చేరుస్తామని అధికారులు అంటున్నారు.

More Telugu News