West Bengal: నాలుగో విడత పోలింగ్‌లో ఉద్రిక్తత.. పశ్చిమబెంగాల్‌లో కేంద్ర మంత్రి కారుపై దాడి

  • అసన్‌సోల్‌ ప్రాంతంలో బాబుల్‌ సుప్రియో కారు ధ్వంసం
  • తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • నదియా జిల్లా పోలింగ్‌ కేంద్రంలో నాటు బాంబును గుర్తించిన ఓటర్లు

నాలుగో విడత పోలింగ్ లో భాగంగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో కారుపై దాడి, నదియా జిల్లా శాంతిపూర్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో నాటుబాంబు గుర్తించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

 రాష్ట్రంలోని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర బలగాలు లేకుండా ఆసన్‌సోల్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటింగ్‌ నిర్వహించడాన్ని తప్పుపడుతూ తృణమూల్‌ కార్యకర్తలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు వీరితో వాదనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు చెదరగొట్టారు.

ఈ ఘటన అనంతరం ఇదే పోలింగ్‌ కేంద్రానికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో రావడంతో ఆందోళనకారులు ఆయనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన కారు అద్దాలు పగులగొట్టారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లను అడ్డుకుంటున్నారని తెలిసి తాను ఇక్కడికి వచ్చానని, ఈ సమయంలో కొందరు తన కారుపై దాడిచేశారని అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులకు తెలిపారు.

మరోవైపు నదియా జిల్లా శాంతిపూర్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తున్న వారు అనుమానాస్పద వస్తువును గుర్తించి పోలింగ్‌ సిబ్బందికి తెలిపారు. భద్రతా సిబ్బంది పరిశీలించగా అది నాటుబాంబు అని తేలడంతో కాసేపు కలకలం రేగింది.

  • Loading...

More Telugu News