Mumbai Indian: కోల్‌కతా మ్యాచ్‌లో కుమ్మేసిన పాండ్యా.. అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు

  • కోల్‌కతా బౌలర్లను ఉతికి ఆరేసిన పాండ్యా 
  • 34 బంతుల్లో 9 సిక్సర్లతో 91 పరుగులు
  • రిషభ్ పంత్ రికార్డు బద్దలు

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. బౌలర్లను చూస్తే చాలు చిర్రెత్తుకొచ్చినట్టు కనిపించిన పాండ్యా వీర కుమ్ముడు కుమ్మాడు. స్టేడియం నలువైపులా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఐపీఎల్‌లోని అసలైన మజాను ప్రేక్షకులకు అందించాడు. కోల్‌కతా నిర్దేశించిన 233 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కోల్‌కతాను వణికించింది. హార్దిక్ పాండ్యా దెబ్బకు ఓ దశలో గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. లక్ష్య ఛేదనలో త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టుకు పాండ్యా ఆపద్బాంధవుడయ్యాడు.

మైదానంలో పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. తొలుత 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పాండ్యా ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాతి 17 బంతుల్లో మరో 41 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న పాండ్యా 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. కాగా, మార్చి 24న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇప్పుడా రికార్డును పాండ్యా తిరగరాశాడు.

More Telugu News