Telangana: నేడు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించనున్న అఖిలపక్షం.. 2న బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపు

  • నేటి ముట్టడిలో పాల్గొననున్న టీడీపీ, టీజేఎస్, సీపీఐ
  • ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్
  • నేటి నుంచి బీజేపీ నేత లక్ష్మణ్ నిరవధిక నిరశన

ఇంటర్ బోర్డు తప్పిదాలను నిరసిస్తూ నేడు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు అఖిలపక్షం సిద్ధమైంది. ‘చలో ఇంటర్మీడియట్‌ బోర్డు’ పేరుతో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, టీడీపీటీఎస్‌ అధ్యక్షుడు రమణ పిలుపునిచ్చారు. టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కూడా తమ మద్దతు ప్రకటించాయి. అఖిలపక్షం నేతలు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు.

మరోవైపు, ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై నేటి నుంచి నిరవధిక నిరశన దీక్ష చేపట్టనున్నట్టు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని తొలగించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఫలితాల్లో అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, వచ్చే నెల 2న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు తెలిపారు. 

  • Loading...

More Telugu News