శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సతో కేఏ పాల్ భేటీ?

  • ప్రస్తుతం శ్రీలంకలోనే కేఏ పాల్
  • రాజపక్సతో కలిసి టీ తాగుతున్న ఫొటో వైరల్
  • ఈ విషయాన్ని వెల్లడించని పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సతో భేటీ అయిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత అమెరికా వెళ్లిన పాల్.. శ్రీలంకలో పేలుళ్ల తర్వాత ఆ దేశానికి వెళ్లారు. మూడు రోజుల క్రితం శ్రీలంక నుంచి ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన ఆయన.. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల గురించి తెలిసిందని, ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. శ్రీలంక మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రలను పరామర్శించారు.  

శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సతో పాల్ భేటీ అయినట్టు ఓ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రాజపక్సతో కలిపి టీ తాగుతున్నట్టు ఉన్న ఆయన ఫొటోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు. ఏ తెలుగువాడు కూడా ఇలా ఓ మాజీ దేశాధ్యక్షుడితో భేటీ కాలేడని, ఇకనైనా పాల్‌ను కామెడీ పీస్‌లా చూపించడం మానుకోవాలని ఆ యూజర్ హితవు పలికాడు.

అయితే, రాజపక్సతో కలిసి పాల్ తేనీరు తీసుకుంటుండడం ఫొటోలో చక్కగా కనిపిస్తున్నా.. ఈ విషయాన్ని పాల్ ఎందుకు వెల్లడించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజపక్స ట్విట్టర్ ఖాతాలోనూ ఇందుకు సంబంధించిన వివరాలు లేవు. దీంతో ఈ ఫొటో ఇప్పటిదేనా? లేక పాతదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
KA Paul
Sri Lanka
Mahinda Rajapaksa
Sri Lanka terror attack

More Telugu News