Andhra Pradesh: యామినీ.. బజారు మనుషుల భాష మాట్లాడితే సమాజం హర్షించదు!: వైసీపీ నేత కోనూరు సతీశ్ శర్మ

  • విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత ఆమెకు లేదు
  • పేరు వెనుక శర్మ తగిలించుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కుదరదు
  • గుంటూరులో మీడియాతో వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు

వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించడంపై వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు కోనూరు సతీశ్ శర్మ మండిపడ్డారు. సాధినేని యామినిశర్మ నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. చేసే విమర్శలు హుందాగా ఉండాలనీ, బజారు మనుషులు మాట్లాడినట్లు మాట్లాడితే సమాజం హర్షించదని హితవు పలికారు. విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత యామిని, వేమూరి ఆనంద్ సూర్యలకు లేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బ్రాహ్మణ మహిళలను రాజకీయ నాయకులు గౌరవిస్తారు కాబట్టి పేరులో శర్మ అని తగిలించుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చని యామిని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌ సూర్య శ్రీవారి బంగారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదంటూ చెప్పడం చంద్రబాబు ఓడిపోతున్నారని అంగీకరించడమేనన్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పనితీరుతో తమ రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని టీడీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జంగా జయరాజు, శేషం సుబ్బారావు, వడ్రానం శివ, తదితరులు పాల్గొన్నారు.

More Telugu News