Mayavati: మాయావతికి ఎదురుదెబ్బ... చక్కెర మిల్లుల విక్రయం అంశంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

  • 2011-12 నాటి వ్యవహారాన్ని తిరగదోడిన సీబీఐ
  • మాయావతి పాలనలో అనేక అవకతవకలు అంటూ ఆరోపణలు
  • రూ.1179 కోట్ల నష్టం వాటిల్లిందంటున్న అధికారులు

ఎన్నికల వేళ దేశ రాజకీయాలు మరింత వేడెక్కాయి.  ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలను ఉసిగొల్పుతున్నారంటూ ఆరోపణలు వస్తున్న తరుణంలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాయావతి సీఎంగా వ్యవహరించిన సమయంలో ఉత్తరప్రదేశ్ లోని 21 ప్రభుత్వ రంగ చక్కెర కర్మాగారాల విక్రయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ సీబీఐ ఆరోపిస్తోంది.

మాయావతి హయాంలో 2011-12 సమయంలో చక్కెర మిల్లుల విక్రయం కారణంగా రూ.1,179 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంటున్నారు. ఈ విక్రయాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకే ఎఫ్ఆఐర్ నమోదు చేయడం జరిగిందని ఓ అధికారి తెలిపారు.

యూపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కారు గతేడాది ఏప్రిల్ లోనే మాయావతిపై సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాయావతిపై సీబీఐ విచారణ అంటే ఆమెను ఇబ్బందుల పాల్జేసే అంశమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

More Telugu News