YSRCP: రాప్తాడు నియోజక వర్గంలో వైసీపీ కార్యకర్తలపై వేట కొడవళ్లతో దాడి!

  • నాగసముద్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడి
  • ఈ దాడి పరిటాల వర్గీయుల పనే అని వైసీపీ ఆరోపణ
  • ఎన్ఎస్ గేటు వద్ద వైసీపీ ఆందోళన
అనంతరపురం జిల్లా రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ను అరెస్టు చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలోని నాగసముద్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వేట కొడవళ్లతో దాడి జరిగింది. ఈ దాడిలో వైసీపీ కార్యకర్తలు నలుగురికి గాయాలయ్యాయి. ఈ దాడికి పాల్పడ్డ ఇద్దరిని స్థానికులు పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. ఈ దాడికి పరిటాల వర్గీయులే కారణమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ, ఎన్ఎస్ గేటు వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో టీడీపీకి సహకరించని వారిపై పరిటాల సునీత వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులు ఇద్దరిని వదిలేయాలని ఎస్సై రఫీకి పరిటాల సునీత ఫోన్ చేసి చెప్పడంతో వారిని వదిలేశారని ఆరోపించారు. పరిటాల శ్రీరామ్ చెప్పడంతోనే ఈ దాడులకు పాల్పడ్డామని నిందితులు చెప్పారని వైసీపీ నాయకులు ఆరోపించడం గమనార్హం. పరిటాల శ్రీరామ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
YSRCP
Telugudesam
raptadu
paritala
sri ram

More Telugu News