Andhra Pradesh: ఏపీపై జీవితాంతం తనకే హక్కు ఉన్నట్టుగా చంద్రబాబు భావిస్తున్నారు: వైసీపీ నేత సజ్జల విమర్శ

  • చంద్రబాబు రోజుకో కొత్త నాటకం ఆడుతున్నారు
  • ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు
  • ఈసీని హెచ్చరించే ధోరణిలో బాబు

ఏపీపై జీవితాంతం తనకే హక్కు ఉన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,చంద్రబాబు రోజుకో కొత్త నాటకంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తూ బాబు నానా యాగీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈసీని హెచ్చరించే ధోరణిలో బాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు చేసిన సమీక్షలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టుపై సమీక్షలు చేశారని, ఈ ఐదేళ్లలో రాజధాని నిర్మాణం కోసం ఒక్క పర్మినెంట్ ఇటుక కూడా వేయలేదని అన్నారు. ఈ ఐదేళ్లు చిత్తశుద్ధితో పని చేసి ఉంటే రాజధాని నిర్మాణం పూర్తయ్యేది కాదా? అని ప్రశ్నించారు. సీఎం సరైన సమయంలో సమీక్షలు చేయకపోవడం వల్లే ఏపీలో పిడుగులు పడి ఏడుగురు చనిపోయారని ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు ప్రస్తావించిన విషయాన్ని సజ్జల గుర్తుచేశారు. చంద్రబాబు రాసిన లేఖ చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి కష్టాలు తీసుకొచ్చిన చంద్రబాబును ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు.

More Telugu News