Sri Lanka: లంకలో మరిన్ని ఉగ్రదాడులు... హెచ్చరించిన అమెరికా!

  • ఈ వారంలో మరిన్ని దాడులు
  • ప్రార్థనాలయాలకు ఎవరూ వెళ్లవద్దు
  • ట్విట్టర్ లో హెచ్చరించిన యూఎస్ ఎంబసీ

మరో వారం రోజుల వ్యవధిలో శ్రీలంకలో మరిన్ని ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. ఈస్టర్ పండుగ వేళ పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేసిన ఉగ్రవాదులు దాదాపు 250 మంది (మొదట్లో లెక్కపెట్టడంలో జరిగిన పొరపాటు కారణంగా సుమారు 350 మందిగా ప్రకటించారు) ని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో లంకలోని ప్రార్థనాలయాలపై మరిన్ని ఉగ్రదాడులకు ముష్కరులు ప్రణాళికలు రూపొందించారని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 28 వరకూ కొలంబోలోని ప్రార్థనాలయాలకు ప్రజలు వెళ్లవద్దని కూడా హెచ్చరించింది. ఈ మేరకు ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసిన అమెరికా అధికారులు, ఎక్కువ మంది జనం గుమికూడిన చోటికి అసలు వెళ్లవద్దని హెచ్చరించారు.

కాగా, ఉగ్రవాదుల కోసం విస్తృత గాలింపు చేపట్టిన పోలీసులు, అనుమానితులను ఎంతమాత్రమూ వదలడం లేదు. అన్ని ప్రాంతాల్లోనూ పోలీసు బందోబస్తును పెంచారు. ఈస్టర్ పేలుళ్లలో ముగ్గురు మహిళలు, ఓ యువకుడి పాత్ర ఉందని, వారి వివరాలు తెలిస్తే, వెల్లడించాలని పోలీసులు కోరారు.

More Telugu News