Sri Lanka: పేలుళ్లు తమ పనేనన్న ఐసిస్.. స్థానిక ఉగ్రవాద సంస్థేనంటున్న శ్రీలంక

  • ఆరుగురి అనుమానితుల ఫొటోలను విడుదల చేసిన శ్రీలంక
  • అనుమానితుల్లో ముగ్గురు మహిళలు
  • వారి వివరాలు తెలిస్తే చెప్పాలన్న పోలీసులు

శ్రీలంక పేలుళ్ల ఘటనకు సంబంధించి ఆరుగురు అనుమానితుల ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరి వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో 250 మందికిపైగా మృతి చెందారు. ఈ ఘటనలో తాజాగా మరో 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కస్టడీలో ఉన్న వారి సంఖ్య 76కు పెరిగింది.

స్థానిక ఉగ్రవాద సంస్థ నేషనల్ థౌహీద్ జమాత్ (ఎన్‌టీజే)కి చెందిన తొమ్మిదిమంది ఉగ్రవాదులు ఈ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారికి ఎన్‌టీజేతో సంబంధాలున్నట్టు చెబుతున్నారు. కాగా, పేలుడుకు సూత్రధారులుగా భావిస్తున్న ఆరుగురి అనుమానితుల ఫొటోలను శ్రీలంక పోలీసులు విడుదల చేశారు. వారికి సంబంధించిన వివరాలు ఉంటే తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరారు. పేలుళ్ల ఘటన వెనక స్థానిక ఎన్‌టీజే సంస్థ హస్తం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తుండగా, అది తమపనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం గమనార్హం.

More Telugu News