Telangana: ‘ఇంటర్’ తప్పులతడకపై కాంగ్రెస్ నేతల ఆందోళన.. విజయశాంతి అరెస్ట్!

  • రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
  • వరంగల్ లో రాజేందర్ రెడ్డి, కొండా సురేఖ అరెస్ట్
  • దొర ఆటలు ఇకపై సాగవన్న విజయశాంతి

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఉద్యమించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈరోజు ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టరేట్లలోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా వరంగల్ లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేత, నటి విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు నాయిని రాజేంద్ర రెడ్డి, కొండా సురేఖ, కొండేటి శ్రీధర్ లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చి 5 రోజులు గడిచినా దొర(కేసీఆర్) మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో బిజీగా ఉన్నాడని విమర్శించారు.

20 మందికి పైగా పిల్లలు చనిపోయినా ఆయనలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై దొర ఆటలు సాగవని వ్యాఖ్యానించారు. విద్యార్థులు అధైర్యపడి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దనీ, వారికి తాము అండగా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఇంటర్ విద్యార్థుల కోసం తాము ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

More Telugu News