modi: ఒబామా ఎప్పుడు కలిసినా ముందుగా ఒకటే ప్రశ్న అడుగుతారు!: మోదీ

  • ఇంకా నాలుగు గంటలే పడుకుంటున్నారా అని ఒబామా అడుగుతుంటారు
  • అత్యున్నత స్థాయికి చేరుకుంటానని కలలో కూడా అనుకోలేదు
  • దేశమంతా నన్ను ఎందుకు అభిమానించిందో ఇప్పటికీ అర్థం కాదు

తాను రోజుకు నాలుగు గంటలు మాత్రమే పడుకుంటానని ప్రధాని మోదీ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలిసారి కలిసినప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారని అన్నారు. ఆ తర్వాత తామిద్దరం ఎప్పుడు కలిసినా... ఇంకా అన్ని గంటలు మాత్రమే పడుకుంటున్నారా? లేక నిద్ర సమయాన్ని పెంచారా? అని అడుగుతుంటారని చెప్పారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

తాను దేశంలోనే అత్యున్నత స్థాయి (ప్రధాని)కి చేరుకుంటానని కలలో కూడా అనుకోలేదని మోదీ అన్నారు. సాధారణ ప్రజలెవరూ ఈ ఆలోచన చేయలేరని చెప్పారు.   అందుకు తగ్గా నేపథ్యం ఉన్నవారే ప్రధాని కావాలనే ఆలోచన చేస్తారని అన్నారు. తనకు చిన్న ఉద్యోగం వచ్చినా ఎంతో సంతోషంతో చుట్టుపక్కల వారికి మా అమ్మ బెల్లం పంచే స్థాయి మాత్రమే ఉన్న కుటుంబం తమదని... ఎందుకంటే అంతకు మించి కనీసం ఆలోచన కూడా చేయలేని పరిస్థితి తమదని చెప్పారు. తమ గ్రామానికి వెలుపల ఏముందో కూడా తమకు తెలియదని అన్నారు.

తాను ప్రధాని కావడం ఒక అసాధారణమైన విషయమని మోదీ చెప్పారు. దేశం తనను ఆదరించిందని... కీలకమైన బాధ్యతలు వాటంతట అవే వచ్చాయని అన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణానికి తన కుటుంబం ఏ విధంగా కూడా ఫిట్ కాదని చెప్పారు. దేశమంతా తనను ఎందుకు అభిమానించిందో, ఎందుకు ఇంత ఇచ్చిందో తనకు ఇప్పటికీ అర్థం కాదని అన్నారు. వాస్తవానికి తాను సన్యాసిని లేదా సైనికుడిని అవ్వాలనుకున్నానని చెప్పారు.

More Telugu News