India: సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కొత్త ధర్మాసనం ఏర్పాటు చేసిన సీజేఐ జస్టిస్ గొగోయ్!

  • జస్టిస్ గొగోయ్ వేధించారని మహిళ ఫిర్యాదు
  • 22 మంది సుప్రీం జడ్జీలకు లేఖ
  • ఈ నెల 26న విచారణ జరపనున్న బెంచ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై మాజీ ఉద్యోగిని ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను తిరస్కరించడంతో తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని సుప్రీంకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఒకరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టులోని 22 మంది జడ్జీలకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు జడ్జీలతో త్రిసభ్య ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ బెంచ్ సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళకు నోటీసులు జారీచేసింది.ఈ నెల 26న జరిగే విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

ఈ వ్యవహారంలో సీజేఐ గొగోయ్.. జస్టిస్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కలిసి త్రిసభ్య బెంచ్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను విచారించే బెంచ్ లో తానే సభ్యుడిగా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జస్టిస్ గొగోయ్ కొత్త బెంచ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

More Telugu News