modi: మీ అమ్మ మీ వద్ద ఎందుకు ఉండటం లేదన్న ప్రశ్నకు మోదీ సమాధానం!

  • అన్ని బంధాలను వదిలేయాలనే విధంగా శిక్షణ పొందా
  • కుటుంబాన్ని వదిలేశాననే బాధ ఇప్పుడు లేదు
  • నీ ఇంట్లో ఉండి నేనేం చేయాలని అమ్మ అడుగుతుంది

కుటుంబ బంధాలను తెంచుకునే సమయానికి తాను వయసులో చాలా చిన్నవాడినని ప్రధాని మోదీ చెప్పారు. జీవితం ప్రారంభంలోనే తాను అన్నీ వదిలేశానని తెలిపారు. ఏ బంధమైనా 'మాయ' అని, అన్ని బంధాలను వదిలేయాలనే విధంగా తాను శిక్షణ పొందానని చెప్పారు. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ లో ఉన్న తన అధికార నివాసంలో సినీ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత బంధాలకు సంబంధించి మోదీ ఈ మేరకు స్పందించారు.

ఇంత పెద్ద నివాసంలో మీరొక్కరే ఉండటం వల్ల మీరు ఒంటరిగా ఫీల్ అవడం లేదా? అనే ప్రశ్నకు బదులుగా 'ఎంత మాత్రం లేదు' అని మోదీ సమాధానం ఇచ్చారు. చిన్న వయసులో కుటుంబాన్ని వదిలేయడం వల్ల తన కుటుంబ సభ్యులను బాధ పెట్టానేమో అనే ఆలోచన మొదట్లో ఉండేదని, ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని తెలిపారు. మీ అమ్మ మీ వద్ద ఎందుకు ఉండటం లేదనే ప్రశ్నకు సమాధానంగా... 'నీ ఇంట్లో ఉండి నేనేం చేయాలి అని అమ్మ అంటుంది. నీతో నేను ఏం మాట్లాడాలని అడుగుతుంది. రాత్రి వేళల్లో నేను ఆలస్యంగా వస్తే అమ్మ అప్ సెట్ అవుతుంది' అని చెప్పారు. అంతమాత్రాన అమ్మతో తనకు అనుబంధం లేదని అర్థం కాదని... దేశమే తన కుటుంబం అనే విధంగా తన జీవితాన్ని మలుచుకున్నానని తెలిపారు.

అమ్మను కలిసిన ప్రతిసారి ఆమె తనకు రూ. 1.25 ఇస్తుందని తెలిపారు. తన నుంచి ఆమె ఏమీ ఆశించదని అన్నారు. తన కుటుంబం కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయలేదని చెప్పారు. మోదీ తల్లి హీరాబెన్ ప్రస్తుత వయసు 98 సంవత్సరాలు. అహ్మదాబాద్ లో ఓటు వేసే ముందు కూడా తన తల్లి ఆశీర్వాదాన్ని మోదీ తీసుకున్నారు.

More Telugu News