Hindu: సాధ్వి ప్రజ్ఞకు అమిత్ షా బాసట.. హిందువు ఎప్పుడూ ఉగ్రవాది కాలేడన్న బీజేపీ చీఫ్

  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ‘హిందూ ఉగ్రవాదం’ పదాన్ని ఉపయోగిస్తున్నారు
  • మాలేగావ్ కేసులో సాధ్విని అన్యాయంగా ఇరికించారు
  • ఓ ప్రణాళిక ప్రకారం కుట్ర జరిగింది

బీజేపీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ చీఫ్ అమిత్ షా ఘాటుగా బదులిచ్చారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్విని కావాలనే ఇరికించారని ఆరోపించిన ఆయన ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ‘హిందూ ఉగ్రవాదం’ పదాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.

భోపాల్ నుంచి ఆమెను బరిలోకి దింపడం ముమ్మాటికీ సరైనదేనన్న షా.. హిందువు ఎప్పుడూ ఉగ్రవాది కాలేడని తేల్చి చెప్పారు. మాలేగావ్ కేసులో ఆమెను ఇరికించారని అన్నారు. ఓటు బ్యాంకు కోసం ఓ ప్రణాళిక ప్రకారం ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. ఛత్రపూర్‌లోని రాజ్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండే సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం బృందం చీఫ్ హేమంత్ కర్కరే తన శాపం వల్లే చనిపోయారంటూ కలకలం రేపారు. అలాగే, 1992 బాబ్రీమసీదు కూల్చివేత ఘటలో తాను పాల్గొన్నందుకు గర్వంగా ఉందంటూ మరోమారు వ్యాఖ్యానించారు. కాగా, 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.

More Telugu News