Telangana: ఇంటర్ విద్యార్థులూ.. ఆందోళన చెందవద్దు.. అందరికీ న్యాయం చేస్తాం!: తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్

  • ఈ నెల 25 వరకూ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఛాన్స్
  • ఈ వ్యవహారంపై విచారణ కమిటీని ఏర్పాటు చేశాం
  • తప్పుచేసినవారిపై రూ.5 వేల జరిమానా, మూడేళ్లు డీబార్

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ స్పందించారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.  రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ నెల  25 వరకూ అవకాశం ఉందనీ, విద్యార్థులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థుల మార్కులు తారుమారు కావడంపై తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీతో చర్చించానని తెలిపారు. విద్యార్థులు రూ.100 చెల్లిస్తే రీ కౌంటింగ్, రూ.600 చెల్లిస్తే రీవెరిఫికేషన్ చేస్తారని స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ 9 వేల దరఖాస్తులు వచ్చాయని జనార్దన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై తాము విచారణ కమిటీని ఏర్పాటు చేశామనీ, కమిటీ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యార్థులు రాసిన జవాబు పత్రాల కాపీలను వారికి అందజేస్తామనీ, జవాబు పత్రాలను దిద్దడంలో లోపాలు ఉంటే పరీక్ష పేపర్ దిద్దిన అధ్యాపకుడు, దాన్ని ఆమోదించిన పై అధికారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీరికి రూ.5 వేల వరకూ జరిమానా విధిస్తామన్నారు. అలాగే మూడేళ్ల పాటు డీబార్ చేసే అవకాశముందన్నారు. విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకోవద్దనీ, అందరికీ న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

More Telugu News