Telangana: భార్యను కులం పేరుతో దూషించి గెంటేసిన భర్త.. 10 సంవత్సరాల జైలుశిక్ష విధించిన కోర్టు!

  • తెలంగాణలోని సంగారెడ్డి జల్లాలో ఘటన
  • యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రవీందర్
  • కుటుంబ సభ్యుల ముందు భార్యగా స్వీకరించేందుకు నిరాకరణ

ప్రేమించాననీ, జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించాడు. ఇంట్లోవాళ్లకు చెప్పకుండా యువతిని పెళ్లి చేసుకున్నాడు. అత్తారింటికి తీసుకెళ్లాలని కోరగా కొట్టి ఇంటి బయటకు గెంటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు నేపథ్యంలో కేసును విచారించిన కోర్టు నిందితుడికి కఠిన శిక్షను విధించింది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కల్హెర్ మండలం ఫతేనగర్ కు చెందిన గంగుల రవీందర్ 2012లో కూకట్ పల్లిలోని ఓ ఫర్నీచర్ షాపులో ట్రాలీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అదే దుకాణంలో పనిచేసే ఓ యువతి(19)ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. పెళ్లి అనంతరం జగద్గిరిగుట్టలో కాపురం పెట్టాడు. అయితే తనను అత్తారింటికి తీసుకెళ్లి వారి ముందు భార్యగా స్వీకరించాలని యువతి కోరింది. ఇందుకు రవీందర్ ససేమిరా అన్నాడు. కులం పేరుతో దూషించాడు. 2013లో రవీందర్ సోదరులు రామగొండ, లక్ష్మణ్, అతని మామ పీరన్న ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకుని యువతిని కులం పేరుతో దూషిస్తూ దాడిచేశారు.

గర్భవతి అన్న కనికరం లేకుండా ఇంటి బయటకు గెంటేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక సెషన్స్ కోర్టు రవీందర్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించింది. అంతేకాకుండా బాధితురాలిపై దాడికి పాల్పడ్డ ముగ్గురు బంధువులకు 6 నెలల చొప్పున జైలు శిక్ష విధించింది.

More Telugu News