Nagababu: ఇంటర్ విద్యార్థులు అలా చనిపోతుంటే మనసుకు బాధేస్తోంది: నాగబాబు

  • ఫెయిలైతే ఎందుకూ పనికిరారా?
  • చదివితేనే భవిష్యత్తు ఉంటుందా?
  • పిల్లలపై అనవసరంగా ఒత్తిడి పెంచుతున్నారు

ఇంటర్ రిజల్ట్స్ అనంతరం పలువురు తెలుగు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం పట్ల మెగాబ్రదర్ నాగబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాగా చదివితేనే గొప్పవాళ్లమా? చదువు అనేది కేవలం పుస్తకాల్లోనే ఉంటుంది, చదివితేనే గొప్పవాళ్లు అవుతామనే భావన కొందరి స్వార్థం, సంకుచితత్వం నుంచి పుట్టుకొచ్చింది అంటూ మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితులకు విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీల స్వార్థ ప్రయోజనాలే కారణం అని ఆరోపించారు. ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం మనసును కలచివేస్తోందని అన్నారు.

ఫెయిలైతే ఎందుకూ పనికిరాడు అనే ఆలోచనతో విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెడుతున్నారని, చదువులో లక్ష్యాలు ఏర్పరచడం సరైన విధానంకాదని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు తమ సొంత ఆలోచనలు పిల్లలపై రుద్దడం భావ్యమా? అంటూ ప్రశ్నించారు.

"అసలీ లోకంలో డాక్టర్లు, ఇంజినీర్ ఉద్యోగాలు తప్ప చేయడానికి పనులే లేవా? చదివితేనే భవిష్యత్తు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఇలాంటి పరిస్థితులు తప్పవు. ఇప్పటి తల్లిదండ్రులను చూసినా, కాలేజీల్లో చూసినా తలపై తుపాకీ పెట్టి చదువుతావా? చస్తావా? అంటూ నిర్బంధంగా చదివిస్తున్నారు. ఎవరికి ఇష్టం ఉన్న రంగాల్లో వాళ్లను ప్రోత్సహించడం ఇలాంటి సమస్యలకు కొంతమేర పరిష్కారం" అంటూ తన ఆలోచనలు పంచుకున్నారు.

More Telugu News