maneka gandhi: నేను అలా అనలేదు.. నా మాటలను తప్పుగా చిత్రీకరించారు: మేనకాగాంధీ

  • ముస్లింలు ఓటు వేయకపోతే ఉద్యోగాలు ఇవ్వబోమన్న మేనక
  • నలువైపుల నుంచి విమర్శల వెల్లువ
  • ముస్లింలు మద్దతు ఇవ్వాలని మాత్రమే తాను కోరానన్న మేనక

ముస్లిం మైనార్టీలంటే తనకు ఎంతో గౌరవం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు మేనకాగాంధీ అన్నారు. ఇటీవల ముస్లింలను ఉద్దేశించి 'ముస్లింలు నాకు ఓటు వేయకపోతే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదు. ఓటు వేయకుండా ఉద్యోగాలు ఎలా అడుగుతారు. మాకు ఓట్లు వేయకున్నా అన్నీ చేస్తూ పోవడానికి మేము మహాత్మాగాంధీ వారసులం కాదు' అంటూ ఆమె వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు అత్యధికంగా ఉండే సుల్తాన్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకాగాంధీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆమె వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. విపక్షాలు బీజేపీ నేతల తీరుపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో మేనక తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

'ముస్లిం మైనార్టీలంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నా వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను నేను ఎప్పుడూ చేయను. ఫిలిబిత్ లో ముస్లింల కోసం నేను ఎంతో చేశాను. అదే విషయాన్ని సుల్తాన్ పూర్ లో చెప్పా. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ముస్లింలను నేను కోరా. మాకు ఓటు వేయకపోతే నా హృదయం విచ్ఛిన్నమవుతుందని చెప్పా. ఎన్నికల కమిషన్ కు నా స్టేట్ మెంట్ తప్పుగా అనిపించవచ్చు. కానీ, నా గుండెల్లో నుంచి నేను ఈ మాటలు చెబుతున్నా' అని మేనక అన్నారు.

మతపరమైన వ్యాఖ్యలను చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నుంచి 48 గంటల పాటు మేనకను ఈసీ నిషేధించింది. ఈ నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించారు. మాయావతి, ములాయం సింగ్ ల కలయికపై మేనక స్పందిస్తూ, స్నేహ భావం ఎప్పుడూ మంచిదేనని చెప్పారు. ఎవరైనా శత్రువులుగా ఎందుకుండాలని అన్నారు. సుల్తాన్ పూర్ లో రామ మందిర నిర్మాణం పెద్ద సమస్య కాదని... సుల్తాన్ పూర్ ను రాముడి కుమారుడైన కుశుడి పేరు వచ్చేలా 'కుశ్ భవన్ పూర్' గా మార్చడమే సమస్య అని చెప్పారు.

More Telugu News